ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 ప్రత్యేక కథనం.



విశ్వాంతరాళంలో మానవులవంటి జీవులు కలిగి వున్న ఒకే ఒక గ్రహం భూమి. దీనిపై జీవుల పుట్టుక దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది. భూమి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. విశ్వంలో మనలాంటి జీవులు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. భూతలం మీది అన్ని జీవాలను పలుమార్లు పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు అమెరికా, రష్యా వంటి పలుదేశాల దగ్గరున్నాయి. వీటిని సమకూర్చు కోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది !? శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి వలన ప్రపంచ దేశాలు దగ్గరయ్యాయి. సంబంధాలు పెరిగాయి. ఇది మంచి పరిణామమే. ఆధిపత్యం కోసం, మార్కెట్టు కోసం పోటీ పెరిగింది. దోపిడీ చేసే రాజ్యాలు, దోపిడీకి గురయ్యే రాజ్యాలుగా విడిపోయాయి. అంతర్జాతీయ సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెత్తనం చెలాయిస్తు న్నాయి. లాభమే పరమావధిగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు పని చేస్తున్నాయి. ప్రజలలో లాభాపేక్ష పెరిగింది. ఫలితంగా జరిగే నష్టాలను, నిజాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు కూడా ఈ ఒరవడికి భిన్నంగా లేవు. పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, విపరీతమైన వాతావరణం, పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రతలను నెమ్మదింప చేయడం లేదా ఆపడం కోట్లాది ప్రజలకు ఈ పరిస్థితుల్లో అసాధ్యమని అనిపిస్తుంది. దీనికి కారణాలు అనేకం. సామ్రాజ్యవాదం నుండి రూపుదిద్దు కున్న "కార్పొరేటీ కరణ", పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రసాదించిన "లాభాపేక్ష" ముఖ్యంగా చెప్పుకోవచ్చు.


ప్రపంచ ధరిత్రీ దినోత్సవం 2023 నేపథ్యం (థీమ్) 

ఐక్య రాజ్య సమితి ఈ సంవత్సరం ప్రపంచ ధరిత్రీ దినోత్సవానికి " మన భూగ్రహం సమగ్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టండి " (ఇన్వెష్ట్ ఇన్ అవర్ ప్లానెట్) ను నేపథ్యంగా ప్రకటించింది. మానవ సుస్థిర నివాసానికి ఉన్నది ఓకే ఒక్క గ్రహం భూమి. దానిని పరిరక్షించి, భద్రపరచి భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత. సర్వ శక్తులు, అవకాశాలు వెచ్చించి ఐక్యంగా ప్రపంచ వ్యాప్తంగా భూగ్రహ సమగ్రాభివృద్ధికి కృషి చేయడమే నేటి మానవాళి భృహత్తర కర్తవ్యం. ఉన్న భూమిని పునరుద్ధరించకుండా అంతర గ్రహాల్లో తమ వాటా (రియల్ ఎస్టేట్ వ్యాపారం) కోసం అర్రులు చాస్తూ వృధా వ్యయ ప్రయాసలకు పూనుకోవడం వ్యర్థం. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వేదికలు పరంగా భూగ్రహ పరిరక్షణ, సమగ్రాభివృద్ధి రాజకీయ అజెండాగా ప్రాధాన్యతను సంతరించుకోవాలి. 

మన భాధ్యత : మీ శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకుండా ప్రతి సం.రం మీ శక్తిని గుర్తు చేయడానికి ఏప్రిల్ 22 ఉపయోగపడుతుంది. మీ స్వరం మరియు ఆచరణ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఇతరులతో ఏకం అయినప్పుడు, విస్మరించలేని సమ్మిళిత మరియు ప్రభావవంతమైన ఉద్యమాన్ని సృష్టించగలము. ఐక్యంగా కలిసి, మన భూగ్రహం కోసం స్థిరమైన మరియు సమానమైన భవిష్యత్తు కోసం శక్తి, ఉత్సాహం మరియు నిబద్ధతతో ఒక సంవత్సరాన్ని నడిపించగలుగుతాము.


కె.వి.వి.సత్యనారాయణ

 రాష్ట్ర కన్వీనర్,_ _ఎన్విరాన్మెంట్ కమిటీ,

 జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్.