ఈరోజు మొదటి విజయవంతమైన మూత్ర పిండ మార్పిడిని నిర్వహించిన ప్లాస్టిక్ సర్జన్, నోబెల్ గ్రహీత జోసెఫ్ ముర్రే జయంతి
జోసెఫ్ ఎడ్వర్డ్ ముర్రే (Joseph Edward Murray ) ( 1 ఏప్రిల్ 1919 - 26 నవంబరు 2012) ఒక అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్. ఆయన అవయవ మార్పిడిపై చేసిన కృషికి గాను 1990 సంవత్సరానికి గాను ఫిజియాలజీ / వైద్యంలో నోబెల్ బహుమతి పొందాడు. అవయవ మార్పిడి రంగంలో ఆద్యుడు.
మన శరీరంలో వివిధ అవయవాలు ఉంటాయి. అవి భిన్న విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క ఒక అవయవం దాని పనిని సరిగా నిర్వహించలేక పోతే ఆ వ్యక్తి బాహ్య సహాయం లేకుండా జీవనం గడపలేడు. ఆ సమస్యకు అవయవ మార్పిడి ఒక పరిష్కారం.
ఒకప్పుడు ఇరువురు వ్యక్తుల మధ్య అవయవ మార్పిడి సాధ్యపడేది కాదు. ఎందుకంటే స్వీకర్త రోగనిరోధక వ్యవస్థ దాత అవయవాన్ని విదేశీ అవయవం / అన్య వస్తువు ( foreign body) గా భావించి తిరస్కరించేది. దాంతో మరణం సైతం సంభవించేది. అందుకే అవయవ మార్పిడి అసాధ్యం అని భావించేవారు. జోసెఫ్ ముర్రే రేడియో థెరపీ, ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడి ఈ అవరోధాన్ని అధిగమించాడు.
ముర్రే డిసెంబర్ 23, 1954 సమరూప కవలలైన ( identical twins) రిచర్డ్ మరియు రోనాల్డ్ హెరిక్‌ల మధ్య మొదటి విజయవంతమైన మానవ మూత్రపిండ మార్పిడిని నిర్వహించాడు. ఈ ఆపరేషన్ ఐదున్నర గంటలపాటు కొనసాగింది. ఆయనకు డాక్టర్ J. హార్ట్‌వెల్ హారిసన్ మరియు ఇతర ప్రముఖ వైద్యులు సహాయం చేశారు. పీటర్ బెంట్ బ్రిగమ్ హాస్పిటల్‌లోని ఆపరేటింగ్ రూమ్ 2 లో ముర్రే దీర్ఘకాలిక నెఫ్రైటిస్‌తో మరణిస్తున్న అతని కవల సోదరుడు రిచర్డ్‌కు రోనాల్డ్ హెరిక్ దానం చేసిన ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని మార్పిడి చేశాడు. రిచర్డ్ ఆపరేషన్ తర్వాత మరో ఎనిమిది సంవత్సరాలు జీవించాడు. ఈ విజయం తర్వాత రకరకాల అవయవ మార్పిడికి దారి చూపింది.
తర్వాత ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడి 1962 లో జన్యుపరంగా సమానత్వం లేని వ్యక్తుల మధ్య కూడా కిడ్నీ మార్పిడి చేయడంలో ముర్రే విజయం సాధించాడు.
అవార్డులు:
మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ టు సర్జరీ
ఫ్రాన్సిస్ అమోరీ ప్రైజ్
గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అవార్డు
గోల్డెన్ ప్లేట్ అవార్డ్
యూనివర్సిటీ ఆఫ్ నోటర్ డేమ్ వారి లెటర్ మెడల్.