సమైక్యశంఖం పూరిద్ధాం! తెలగజాతిని కాపాడుదాం!
విజయనగరం::-ఉత్తరాంధ్రలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన తెలగ జాతిని సమైక్య పరచి ప్రధానమైన బీసీ స్టేటస్, రాజకీయ రంగంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుదామని జిల్లా తెలగ సంఘ ప్రతినిధులు ప్రతిన పూనారు. మంగళవారం రాత్రి ఇక్కడి రోటరీ కమ్యూనిటీ హాల్లో జిల్లా తెలగ సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు ఎజ్జు మురళీ కృష్ణ అధ్యక్షతన జరిగింది. కుల ప్రముఖుల జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమైన ఈ సభలో వివిధ అంశాలపై చర్చ జరిగింది.అధ్యక్షులు
మురళీ కృష్ణ మాట్లాడుతూ ఏడాదిలో సంఘం తరపున గణనీయమైన కార్యక్రమాలు చేపట్టామని. తమ కార్యవర్గ పనితీరును విశ్లేషించాలని కోరారు. ఆమేరకు కార్యవర్గంపై సభికులు సంపూర్ణ విశ్వాసాన్ని , సంతృప్తిని తెలిపారు. రానున్న కాలంలో సమైక్య శంఖారావంతో ముందుకు సాగాలన్ని అభిలషించారు.
ఈసందర్భంగా వేదికపై ఆశీనులైన సంఘ ప్రముఖులు డాక్టర్ విఎస్ ప్రసాద్, వాదా ప్రసాదరావు, దిమిలి అచ్యుతరావు మాట్లాడుతూ జిల్లా సంఘం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చేసిన కృషిని వివరించారు. తెలగ కల్యాణ మండపం నిర్మాణానికి తగు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కల్యాణ మండపం నిర్మాణానికి సుమారు కోటి రూపాయిలకు పైగా విలువైన స్ధలాన్ని విరాళంగా అందించిన ఆర్.కె మాస్టారుకు సమావేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.సమావేశంలో శ్రీకాకుళం జిల్లా తెలగ సంఘ అధ్యక్షులు అజిత్ కుమార్ , సంఘ నాయకులు పి. రామకృష్ణ, జగదీష్. కె. మురళీ, పాలుశ్రీను తదితరులు మాట్లాడారు. సంఘ సారధులు మొంగం నారాయణరావు, డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రభృతులు పాల్గొన్నారు. కాగా రాజకీయంగా తెలగ జాతిని గుర్తించే పార్టీకే మద్దతు తెలపాలన్న ప్రతిపాదనపై చర్చించారు. ఇంతవరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంఘం తరపున చేపట్టిన కార్యక్రమాల నివేదికను ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ వివరించారు. 2006 నుంచి ఇంతవరకు సంఘానికి సేవలందించిన అధ్యక్ష. కార్యదర్శులు, ఇతర కార్యవర్గ ప్రముఖల గురించి శివప్రసాద్ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్ పసుపురెడ్డి శ్రీనివాసరావు, టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ అడపా శ్యామ్ కుమార్,, బిసిసిఐ ఆల్ ఇండియా పానెల్ స్కోరర్ తోట విజయ్, బాక్సింగ్ కోచ్ ఊడి సంతోష్ కుమార్, నేషనల్ సబ్ జూనియర్ బాక్సర్ ఊడి జయరాంలను సత్కరించారు. సంఘ ప్రగతికి కృషి చేస్తున్న ముదిలి శ్రీనివాసరావును కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్లు అధ్యక్షులు ప్రకటించి సత్కరించారు. సమావేశానికి ముందు గాయత్రి , హేమలత ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.