బంగారు రేకుతో తయారుచేసిన శ్రీ రామ యంత్రాన్ని ప్రాంగణానికి మేళ తాళాలతో తీసుకొచ్చి దాని విశిష్టతను, సంపూర్ణ రామాయణ ప్రవచనాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి వారు భక్తుల మనస్సు హత్తుకునే విధంగా రెండో రోజు కార్యక్రమం దిగ్విజయం చేశారు.
January 26, 2025
విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం లో (జీవీఎంసీ ఆరు వార్డ్ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్. సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.)
కొమ్మాది లోని గాయత్రీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణములో జరుగుతున్న "సంపూర్ణ శ్రీరామాయణ" ప్రవచనములలో భాగముగా రెండవ రోజయిన ఆదివారం సాయంత్రం (26-01-2025) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఋష్యశృంగ మహర్షి యొక్క చరిత్ర, పుత్రకామేష్టి యాగము, హనుమ, ఇతర వానరులు, శ్రీరామ లక్ష్మణ భారత శత్రుఘ్నుల ఆవిర్భావ ఘట్టములను గూర్చి ప్రవచనము చేశారు. శ్రీరాముని జనన సర్గ నడిచిన సందర్భముగా త్రేతా యుగంలో అయోధ్య నగరములో జరిగిన విధముగా మంగళ ధ్వనుల మధ్య శ్రీరాముని పై పుష్ప వృష్టి కురిపించి, ప్రత్యేక మంగళ నీరాజనములు సమర్పించారు.
సనాతన ధర్మంలో యజ్ఞము అత్యంత ప్రధానమైనది అని, యజ్ఞము చేత ప్రీతి చెందిన దేవతలు ధర్మికమైన కోరికలు తీరుస్తారు. అని రామాయణములో శ్రీ రామ జననము కొరకు దశరథ మహారాజు చేసిన అశ్వమేధం, పుత్రకామేష్టి తెలియజేస్తుంది అని కోటేశ్వర రావు గారు ప్రవచించారు.
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కాంచీపురం నుండి ప్రత్యేకముగా పంపించిన శ్రీరామ యంత్రమును ప్రవచన కార్యక్రమమునకు ముందు మేళతాళములతో సభలోనికి తీసుకువచ్చి వేదిక మీద అలంకరింపచేశారు. బంగారు రేకుపై ఈ యంత్రము అయోధ్యలో రామ మందిరంలో ప్రతిష్టింపబడినది. దాని యొక్క మరొక నమూనా ఈ సంపూర్ణ రామాయణ ప్రవచనముల సందర్భముగా విశాఖపట్నమునకు చేరుకొనుట అత్యంత శుభ పరిణామణి శ్రీ చాగంటి వారు తెలియజేశారు. ఈ యంత్రము అనేక మంత్రముల యొక్క సమాహారమని, ఇందులో సీతారాముల యొక్క ప్రాణ శక్తిని ఉంచారని, అందుచేత ఈ యంత్రము అత్యంత శక్తివంతము పరమ పవిత్రమైనదని వారు తెలియజేశారు. వేదికపై ఉన్న ఈ యంత్రమును భక్తులందరూ దర్శనము చేసుకొని ఎంతో పులకరించారు.
శ్రీరామ జననము జరిగిన సందర్భముగా గర్భిణులందరికీ సుఖప్రసవము అయ్యి, వారు ఆరోగ్యవంతముగా ఉండుట కొరకు తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని గర్భరక్షాంబిక అమ్మవారి ప్రసాదముగా ఒక ప్రత్యేక శ్లోకమును ధర్మవర్ధిని ట్రస్టు ముద్రించి భక్తులందరికీ ఉచితముగా పంచటం జరిగినది. ఈ శ్లోకము మహాత్యమును తెలియజేసి, శ్రీ చాగంటి వారు సభలోని వారందరిచే ఈ శ్లోకమును చదివించారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సమస్య లేకుండా సుఖపసవము జరుగుటకు ఇది ఒక గొప్ప వరప్రసాదమని వారు వివరించారు.