తప్పు చేస్తే ఎంతటి వాడైనా శిక్ష అనుభవించాల్సిందే --- సంపూర్ణ రామాయణ గాధ. గంగావతార ఘట్టం .--- రామ భక్తుల హృదయంహత్తుకుంటున్న చాగంటి ప్రవచనాలు. ----

శ్రీరామచంద్రుడికి విశ్వా మిత్ర మహర్షి గంగావతార ఘట్టం గురించి ప్రవచనం ఇస్తున్న బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు. (మధురవాడ, కొమ్మాది : ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను 9502817542,---,9440592368 ) పెద్దలపట్ల తారతమ్యమెరుగక అత్యుత్సాహముతో ప్రవర్తించటము అత్యంత ప్రమాదకరమని, మహానుభావుడైన కపిల మహర్షి పట్ల అటువంటి అత్యుత్సాహముతో ప్రవర్తించటం వలనే సగరులందరూ బూడిద కుప్పలు అయిపోయారని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. 42 రోజులపాటు సాగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచన మహా యజ్ఞములో భాగముగా ఐదవ రోజైన నేడు (29-01-2025) బాలకాండలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు చెప్పిన గంగావతరణ ఘట్టమును గూర్చి వారు ప్రవచనం చేశారు. తప్పు చేసినవాడు సొంత కుమారుడే అయినా అది ఉపేక్షింపక సమాజ హితము కొరకు సగర చక్రవర్తి ప్రవర్తించారనీ, స్వప్రయోజనముల కన్నా సమాజ ప్రయోజనము కొరకు ఆలోచించటం ఏ తరమునకైనా పాలకులకు ఆదర్శప్రాయమైన విషయమని శ్రీరామాయణం మనకు నేర్పిస్తుందని వారు తెలియజేశారు. తన వంశములో ఎక్కడో మూడు తరాలకు ముందున్న పెద్దలను ఉద్ధరించుట కొరకు వయసులో ఉన్న భగీరధుడు రాజ్యమును, భోగములను త్యాగము చేసి అంత గొప్ప తపస్సు ఆచరించాడని, అందుచేతనే ఆయన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారని, ఆయన చేసిన ప్రయత్నమును ఇప్పటికీ భగీరథ ప్రయత్నం గా కీర్తిస్తామని శ్రీ చాగంటి వారు అభివర్ణించారు. పాలకుల నుండి ప్రజల వరకు సమాజంలో ఉన్న అందరికీ శ్రీరామాయణం ప్రవర్తనను నేర్పిస్తుందని, ఇటువంటి ఇతిహాసములు మనకు ఎప్పటికీ నడవడి విషయంలో కరదీపికలేనని వారు కొనియాడారు. గంగావతరణం అనేక మలుపులతో కూడుకున్న మహత్తరమైన ఘట్టమని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్పర్శ కలిగిన గంగ పరమ పావనమైన నది అని, గంగను కేవలం స్మరించటము చేతనే పాపములు నశిస్తాయని, ఈ గంగావతరణ ఘట్టమునకు వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఈ ఘట్టమును విన్నవారి పితృదేవతలు కూడా ఎంతో సంతోషిస్తారని చెప్పారని కోటేశ్వరరావు గారు తెలియజేశారు. పరమ పవిత్రమైన గంగావతరణ ఘట్టము యొక్క ప్రవచనము జరిగిన సందర్భముగా గంగాజలములను తెప్పించి, ప్రత్యేకమైన కలశలో ఉంచి, శివ పార్వతుల తో పాటు వేదిక పై అలంకరించి, ఆ గంగాజలములకు మంగళనీరాజనాలు సమర్పించి, సభలోని వారందరికీ ఆ గంగాజలములను ప్రోక్షణ చేశారు.