విశ్వామిత్రుడు చరిత్రను శతానందుడు శ్రీరాముడికి తెలియజేస్తున్న బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు సంపూర్ణ రామాయణ ప్రవచనాలు--- ఎంతో ఆసక్తిగా విన్న రామ భక్తులు.

సనాతన ధర్మంలో భార్యను భర్త, భర్తను భార్య వదిలేయడం ఎక్కడా లేదు. ఇద్దరూ తప్పులు సరిదిద్దుకొని నడవడి కలిసి జీవనం సాగించడమే దాంపత్య పరమార్థమ0- బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి. (మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానo శ్రీను పాత మధురవాడ మెట్ట ) సనాతన ధర్మములో భార్య భర్తని లేదా భర్త భార్యని వదిలివేయటం అనే సంప్రదాయమే లేదని, భార్యాభర్తలలో ఎవరు తప్పు చేసినా, మరొకరు ఆ తప్పును సరిదిద్ది కలసి జీవన ప్రస్థానం సాగించటమే దాంపత్యం పరమార్థమని బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా ఆరవ రోజున కమ్మాది గాయత్రి విద్యా పరిషత్ మహిళా కళాశాల ప్రాంగణంలోఅహల్యా వృత్తాంతమును, విశ్వామిత్రుని చరిత్రను ప్రవచనము చేశారు. గొప్ప నడవడి కలిగినదైన అహల్యా మోహమునకు, లోభమునకు వశపడి చేయరాని తప్పు చేసినా, గౌతమ మహర్షి పాపప్రక్షాళనార్థం తపస్సు చేస్తూ ఉండమని, ఆవిడను బూడిద కప్పి ఉంటుందని, శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా వచ్చిన తరువాత ఆవిడకు శాప విమోచన అవుతుందని ఆవిడ చేసిన తప్పును సరిహద్దుకునే అవకాశాన్ని ప్రసాదించారు. అంతేకానీ ఆవిడను పరిత్యజించి తాను జీవితాన్ని సాగించలేదు. గౌతముడు-అహల్య ఎన్ని తరాలు మారినా దంపతులకు ఆదర్శము అని శ్రీ చాగంటి వారు వివరించారు. తన వలన శాపవిమోచనం పొందిన అహల్య పరమపతివ్రత కనుక ఆవిడకు లక్ష్మణునితో కలిసి తానే ముందుగా నమస్కరించటం శ్రీరాముని యొక్క వినయ సంపదకు నిలువెత్తు తార్కాణం అని వారు వివరించారు. విశ్వామిత్ర మహర్షి చరిత్రను శతానందుడు శ్రీరామునకు తెలియజేసిన విధానము గురించి ప్రవచిస్తూ ఒక మనిషి పట్టుద
ల, ధృతి చేత దీనినైనా సాధించగలడు అనేదానికి విశ్వామిత్రుని చరిత్ర ఉదాహరణ అని కోటేశ్వరరావు ప్రవచించారు. బ్రహ్మర్షి అవుదాము అనే సంకల్పముతో గొప్ప తపస్సు ప్రారంభించిన విశ్వామిత్రుడు కామ క్రోధాది అరిషడ్వర్గముల చేత కొట్టబడి, అన్ని దిక్కులా తపస్సు చేసి, ప్రతిసారి తన తపస్సు భంగమైనప్పటికీ పట్టు విడవకుండా అంత గొప్ప తపస్సు ఆచరించి, బ్రహ్మర్షిత్వాన్ని సాధించుకున్నాడని, ఆయన ఎన్ని తరాలు మారినా అందరికీ గొప్ప ఆదర్శప్రాయుడని వారు తెలియజేశారు. విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర తెలుసుకున్న శ్రీరాముడు ఎంతగానో ప్రభావితుడై, ఎన్ని కష్టాలు అనుభవించినా వాటన్నిటిలో కూడా గొప్ప పట్టుదలతో నిలదొక్కుకుని అన్ని కష్టములను అధిగమించి విజయములు సాధించాడని, అలా శ్రీరామచంద్రుని చెక్కిన మహాపురుషుడు విశ్వామిత్రుడు అని వారు శ్లాఘించారు. ప్రవచన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.