తన తండ్రి అనుమతి లేనిదే వివాహం చేసు కోనని, శ్రీరామచంద్రుడు చెప్పడం. రాముడు వివాహానికి పిలవకుండానే మేనమామ వెళ్లడం, జనక మహారాజు ఆ వివాహంలో తన తమ్ముడైన కుసాధ్వజునికి ఎంతో ప్రాధాన్యతను ఇవ్వడం... సీతారామ కళ్యాణం కుటుంబ పెద్దలకు, అన్నదమ్ములు, మేనమామలు, ఆడబిడ్డల రక్త సంబంధ బాంధవ్యాలను మానవీయ సంబంధాలకు సీతారాముల కళ్యాణం ఒక ఆదర్శప్రాయం -- సంపూర్ణ రామాయణం లో భాగంగాబాలకాండ లో ప్రవచనాన్ని ఎంతో అద్భుతంగా వివరించిన చాగంటి... అది వినే భక్తులను ఆలోచింపజేసిన చాగంటి.

విశాఖపట్నం (మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను ) భారత వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేసిన మహోన్నతమైన ఘట్టము శ్రీ సీతారామ కళ్యాణమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు ప్రవచించారు. విశాఖపట్నం కొమ్మాదిలోని గాయత్రీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా శుక్రవారం ఏడవ రోజు బాలకాండలోని శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టమును గూర్చి వారు ప్రవచనం చేశారు. శివధనుర్భంగం చేసిన శ్రీరామునికి సీతమ్మను ఇచ్చి వివాహం చేయటానికి సిద్ధపడిన జనక మహారాజు తో శ్రీరాముడు ఆ విషయములో నిర్ణయాధికారము కేవలం తన తండ్రి అయిన దశరథ మహారాజు ది అని, వారిని సంప్రదించి వారి అనుమతితోనే వివాహము చేసుకుంటానని చెప్పాడని చాగంటి వారు అన్నారు. తాను వివాహము చేసుకోబోయే అమ్మాయి కేవలం తనకు భార్య మాత్రమే కాకుండా తన వంశ ప్రతిష్ట నిలపవలసిన కోడలు కూడా కాబట్టి వివాహ విషయంలో నిర్ణయము ఎప్పుడూ అనుభవజ్ఞులైన పెద్దలే చేయాలని శ్రీరాముడు చెప్పిన విషయము అందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం అని వారు వివరించారు. ఎన్ని తరాలు మారినా సీతారాముల దాంపత్యం ఎప్పటికీ ఆదర్శప్రాయం అని ఆ దాంపత్యమునకు నాంది పలికిన ఘట్టము సీతారామ కళ్యాణమని శ్రీ చాగంటి వారు తెలియజేశారు. అంగరంగ వైభవంగా జరిగిన సీతారామ కళ్యాణం లో మానవీయ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారని, మేనమామ అయిన యుధాజిత్తు శ్రీరాముని కళ్యాణములో పాల్గొనటానికిr పిలవకుండానే వచ్చి నిలబడటం, జనకమహారాజు తన తమ్ముడైన కుసాధ్వజునికి వివాహ విషయంలో ఎంతో ప్రాధాన్యతను ఇవ్వటం కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, బంధుత్వములకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను తెలియజేస్తుందని కోటేశ్వర రావు ప్రస్తావించారు. వివాహ క్రతువులో సమయపాలనము అత్యంత ప్రధానమైన విషయమని, వధూవరులు సమయమునకు తయారయ్యి రాకపోతే దేవతల ప్రీతి కొరకు చేయవలసిన క్రతువులను పూర్తిగా చేయలేరని, అందుచేత సమయపాలన తప్పకుండా చేయమని విశ్వామిత్ర మహర్షి సీతారాములకు చెప్పిన విషయము వివాహము చేసుకునే వారందరికీ ఆదర్శమని చాగంటి వారు అభివర్ణించారు. అయోనిజమైన సీతమ్మకు తగిన వరుణ్ణి వెతకటానికి దేవతా వ్యూహములో భాగము గానే ముందుగా జనకమహారాజు గారి వంశములో శివధనస్సు ఉంచబడిందని, ఆ శివధనస్సును విష్ణువు అవతారమైన శ్రీరాముడు ఎత్తటం శివ కేశవ అబేధాన్ని సూచిస్తుందని శ్రీ చాగంటి వారు ప్రవచించారు. అలాగే రెండు విష్ణు అవతారములైన పరశురామ రామావతారములు కలుసుకున్న ఘట్టము చాలా గొప్పదని, ఒకేసారి భూమి మీద ధర్మసంస్థాపన కొరకు రెండు విష్ణు అవతారములు అవసరము లేదు కనుక శ్రీరాముని యందు తన తేజస్సును కూడా నీక్షేపించి పరశురాముడు తపస్సుకు వెళ్లిపోయారని, ఆ ఘట్టం యొక్క అంతర్యమును చాగంటి వారు ఎంతో గొప్పగా వివరించారు. శ్రీరామాయణంలోని బాలకాండ ప్రవచనములు పూర్తయిన సందర్భముగా ఆ కాండలో అత్యంత ప్రధానమైన విశ్వామిత్ర మహర్షి స్వరూపముగా శ్రీ ఆచార్య సోమరాజు గారి దంపతులను సత్కరించి, వారికి నూతన వస్త్రములు బహుకరించారు.