యుద్ధంలో కూడా ధర్మాన్ని పాటించిన పరమ ధర్మాత్ముడు శ్రీరాముడు---- బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు.

, విశాఖపట్నం,మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) యుద్ధములో కూడా ధర్మమును మాత్రమే, పాటించే పరమ ధర్మాత్ముడు శ్రీరాముడని, సత్తువ వీగిపోయిన రావణాసురుడు, చేజిక్కినప్పటికీ ధర్మమును పాటించి అతడిని వదిలిపెట్టిన శ్రీరాముని క్షమా గుణం చాలా గొప్పదని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు ప్రవచించారు. విశాఖపట్నం కొమ్మాది గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా సోమవారం సాయంత్రం యుద్దకాండలో ఇంద్రజిత్తు, రావణాసుర, కుంభకర్ణులకు రామలక్ష్మణులు, వానరసైన్యమునకు మధ్య జరిగిన యుద్ధ ఘట్టములను గూర్చి ప్రవచనము సాగినది. రామలక్ష్మణులు వానర సైన్యముతో కలిసి ఇంద్రజిత్తు యొక్క రథమును, గుర్రములను నాశనము చేయగా అతడు ఆకాశములోనికి ఎగిరిపోయి మేఘముల చాటున దాగుండి మాయా యుద్ధమును ప్రారంభించాడని, అతడి వేగమును నిరోధించమని శ్రీరాముడు వానరులను పంపించినప్పటికీ వారు ఎవరికి దొరకకుండా వానరుల వేగమునే అతడు నిరోధించాడని, అప్పుడు ఇంద్రజిత్తు కద్రువ యొక్క కుమారులైన నాగులను భయంకరమైన నాగాస్త్రములుగా ప్రయోగించి రామలక్ష్మణులు ఇరువురిని బంధించాడని, స్పృహను కోల్పోయిన రామలక్ష్మణులలో శ్రీరాముడు స్పృహను పొందిన తరువాత ఇక ఆ నాగాస్త్ర బంధనమును విడిపించుకునే పరిస్థితి లేదని తెలుసుకొని విభీషణుని పట్టాభిషిక్తుడను చేస్తానని ఇచ్చిన మాట నెరవేర్చలేక పోతున్నందుకు బాధపడ్డాడని శ్రీ చాగంటి వారు వివరించారు. అదే సమయములో భయంకరమైన గాలితో గరుత్మంతుడు అక్కడికి విచ్చేయగా ఆయనను చూచి ఆ నాగులన్నీ పారిపోయాయని, రామలక్ష్మణులు ఇద్దరూ నాగాస్త్ర బంధనము నుండి విముక్తులయ్యారని, తాను శ్రీరామునకు చిరకాల స్నేహితుడినని, గరుత్మంతుడనని పరిచయము చేసుకున్న ఆయన వారి స్నేహము ఎట్లా ఏర్పడినది అనే విషయమును మాత్రం ఇప్పుడు చెప్పలేదని చెప్పి, ఆయన స్పర్శచే రామలక్ష్మణులకు మరింత శక్తిని, సూక్ష్మ బుద్ధిని గారుక్మంతుడు కట్టబెట్టాడని వారు వివరించారు. ధర్మాచరణ తత్పరుడైన శ్రీరామునకు ఎప్పుడు ఏ కాలములోనూ ఆపద సంభవించినా ఆయనను దైవము కాపాడుతూ ఉంటుందని వారు అభివర్ణించారు. రావణాసురి సర్వ సైన్యాధిపతి అయిన ప్రహస్తుడిని వానర సర్వ సైన్యాధిపతి అయిన నీలుడు సంహరించగా, తరువాత రావణాసురుడు స్వయముగా యుద్ధమునకు వచ్చాడని, రావణాసురునితో హనుమ, సుగ్రీవుడు యుద్ధము చేసిన తర్వాత లక్ష్మణుడు కూడా యుద్ధము చేయగా ఆయనపై రావణాసురుడు బ్రహ్మదత్తమైన శక్తిని ప్రయోగించాడని, లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయాక అతడిని లంకలోకి తీసుకువెళ్దాం అని ప్రయత్నించినప్పుడు విష్ణుశక్తి ఆవహించుట చేత లక్ష్మణుని అతడు ఎత్తలేకపోయాడని, అప్పుడు హనుమ వచ్చి రావణాసురుని మర్దించి లక్ష్మణుని కాపాడారని, ఆ తరువాత హనుమ యొక్క భుజములపై ఎక్కి శ్రీరాముడే రావణాసురునితో యుద్ధమునకు వచ్చాడని శ్రీ చాగంటి వారు వివరించారు. రామ రావణులకు మహోగ్రమైన యుద్ధము సాగుతుండగా రావణాసురుడు హనుమను కొన్ని వేల బాణములతో కొట్టాడని, అందుకు కోపించిన శ్రీరాముడు రావణాసురుని యొక్క రథమును, ధనుస్సును, కిరీటములను కూడా పడగొట్టి అతడిని నిర్వీర్యుడిని చేశాడని, అలసిపోయి ఓడిపోవుటకు సిద్ధముగా ఉన్న రావణాసురునితో ధర్మమును పాటించి యుద్ధము చేయకుండా, అతడిని స్వస్థత పొంది మరల యుద్ధములకు రమ్మని శ్రీరాముడు పంపించాడని, యుద్ధములో కూడా ఆయన ధర్మ నిరతి అంత గొప్పదని వారు అభివర్ణించారు. రావణాసురుని ఆజ్ఞపై నిద్రిస్తున్న కుంభకర్ణుడిని రాక్షసులందరూ ఎన్నో విధములుగా ప్రయత్నించి చివరకు నిద్ర లేపారని, లేచి వచ్చిన కుంభకర్ణుడు చాలా గొప్ప యుద్ధము చేశాడని, శూలము తోటి, తన పాదములతో తొక్కి, వానరులను నోట్లో పడేసుకుని ఎంతో భయంకరమైన యుద్ధమును ఆతడు చేశాడని, చివరికి శ్రీరాముడు అతడి చేతులు, కాళ్ళు ఖండించి శిరస్సును కూడా ఖండించి అతనిని చంపివేయగా అతడి శరీరము అక్కడ ఉన్న కోట బురుజులను పడగొడుతూ వెళ్లి సముద్రంలో పడిపోయిందని, అక్కడితో కుంభకర్ణ వధ పూర్తయిందని దేవతలందరూ ఎంతో సంతోషించారని శ్రీ చాగంటి వారు యుద్ధమును ఎంతో గొప్పగా వర్ణించారు.