బంగారు అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారామ కళ్యాణం.

కళ్యాణం .. కమనీయం ముల్లోకాలు మురిసేలా సీతారాముల కల్యాణం - పులకరించిన భక్తజనం - భక్తి పారవశ్యంలో ఓలలాడిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ ప్రాంగణం. జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్ నామస్మరణలతో రాములోరిని పురవీధుల్లో ఊరేగింపు. మధురవాడ - ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్టు మానo శ్రీను, జగదానంద కారకుడు, జగదభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. శ్రీ విజయదుర్గా దేవి ఆలయం మరియు భక్తుల తరపున బంగారు అశోక్ కుమార్,ఝాన్సీ దంపతులు,వంకాయల సాయి కుమార్,సాయి ప్రవల్లిక దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారు.లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం విశాఖ నగరంలోని మధురవాడ ,టైలర్స్ కోలనీలో వేంచేసియున్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త బంగారు సుబ్బారావు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగింది. కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఆలయ పురోహితులు శ్రీకాంత్ శర్మ పర్యవేక్షణలో వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ కల‌్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళతాళాలు, భక్తుల జయజయద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. 12 దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకు అలంకరించారు. యోక్త్రధారణ చేయడం ద్వారా గర్భస్త దోషాలు తొలుగుతాయని చెబుతారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి, కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువనిపెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. పలు అభరణాలను స్వామి, అమ్మవారికి అలంకరించారు.కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. జగత్ కల్యాణ శుభ సన్నివేశాన్ని కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు.రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మనిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంలో ఓలలాడింది.. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత సీతమ్మ చీరకు, రామయ్య పంచె / ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేశారు. అనంతరం మంగళ హారతి అందించారు.. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో పురవీధుల్లో ఊరేగించారు.. అనంతరం భక్తులకు పానకం ,ప్రసాద వితరణ గావించారు ..ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్,ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్, తెంటు మాధవి,వట్టికుల నాగమ్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు